నెల రోజుల్లో ఎన్డీయేకు మరో ఝలక్-ఉపఎన్నికల్లో ఇండియా కూటమి స్వీప్..!

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ సీట్లకు ఈ నెల 10న జరిగిన ఉపఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సాధారణ మెజార్టీని దూరం చేసి మిత్రపక్షాలపై ఆధారపడేలా చేసిన ఇండియా కూటమి.. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో మరోసారి దుమ్ము రేపింది. ఈసారి సార్వత్రిక ఎన్నికలను మించి సీట్లు సాధించి బీజేపీని, ఎన్డీయేను వెనక్కి నెట్టేసింది. ఎన్డీయే వర్సెస్ ఇండియా బ్లాక్ గా మారిన పోరులో అసాధారణ విజయాలు అందుకుంది.

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఒక్కొక్క సీట్లకు ఈ నెల 10న ఉపఎన్నికలు జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు ఇవాళ జరిగింది. ఫలితాల్లో బెంగాల్లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్తలా అసెంబ్లీ సీట్లలో ఉపఎన్నికలను అధికార టీఎంసీ గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని మూడు సీట్లలో రెండు గెల్చుకోవడం ద్వారా అధికార కాంగ్రెస్ సత్తా చాటింది. ఇందులో సీఎం భార్య కమలేష్ ఠాకూర్ పోటీ చేసిన డెహ్రా సహా మరో సీటు కూడా ఉంది.

 

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగలౌర్ లో కాంగ్రెస్ గెలుపొందింది. పంజాబ్ లోని జలంధర్ సీటును ఆప్ గెల్చుకుంది. తమిళనాడులోని విక్రవండీ సీటులో డీఎంకే ఘన విజయం సాధించింది. ఎన్డీయే కూటమిలో భాగమైన బీజేపీ మధ్యప్రదేశ్ లోని అమర్వారా సీటులో గెలిచింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ సీటును బీజేపీ గెల్చుకుంది. మరోవైపు బీహార్ లోని రూపౌలీ సీటును జేడీయూ గెల్చుకుంది. దీంతో ఇండియా కూటమికి 10 సీట్లు, ఎన్డీయేకు 3 సీట్లు దక్కినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *