పూరీ జగన్నాథ రథయాత్రకు పోటెత్తిన భక్తజనం..!

ప్రపంచం ప్రసిద్ధి చెందిన ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూరీ పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఒకేసారి మూడు వేడుకలు చేపట్టడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి.

 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమెతోపాటు ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు భక్తులతో కలిసి జగన్నాథ రథం తాళ్లను లాగారు. అయితే ఓ భారత రాష్ట్రపతి పూరి జగన్నాథ రథయాత్రకు హాజరు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా, ఈ యాత్ర సోమవారం కూడా కొనసాగింది.

 

బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాలం కలిగి ఉన్న ఈ రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాధుని రథాలు అనుసరించాయి. దాదాపు 4వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగారు.ప్రతియేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు.

 

జగన్నాథ యాత్రలో భాగంగా బలభద్రుని రథం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురికాగా, పలువురు గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందులో ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా..ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి మృతి చెందాడు. ఈ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సీఎం చరణ్ మాఝి సంతాపం వ్యక్తం చేశారు. కాగా, పూరీలోని బడా దండాలో జరిగిన తొక్కిసలాటలో 300మందికి పైగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *