పరీక్షలకు సంబంధించిన మరో కుంభకోణం అస్సాంలో వెలుగులోకి వచ్చింది. బీజేపీ పాలిత ప్రాంతమైన అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో క్యాష్ ఫర్ మార్క్స్ స్కామ్ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌహతి యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గణేష్ లాల్ చౌదరీ కాలేజీకి చెందిన ఓ విద్యార్థికి మార్క్ షీట్‌లో కాలేజీ యాజమాన్యం తేడాను గుర్తించింది.
పరీక్షలకు సంబంధించిన వాస్తవ మార్కులు, మార్క్ షీట్‌లోని మార్కులకు తేడా గమనించిన యాజమాన్యం మార్క్ షీట్‌ను యూనివర్సిటీకి పంపించి తనిఖీ చేయించారు. సదరు విద్యార్థి డబ్బులు చెల్లించి మార్కులు పెంచుకున్నట్లు బయటపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సీఐడీ విభాగం దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసింది.
విద్యార్థి అజీజుల్ హక్‌ను పోలీసులు ప్రశ్నించగా మొదటి, మూడు, నాలుగు, ఐదవ సెమిస్టార్‌లలో మార్కులు మార్చటానికి రూ. 10 వేలు చెల్లించినట్లు అంగీకరించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. గౌహతి యూనివర్సిటీలో కంప్యూటర్ సిస్టమ్ ఆపరేట్ చేసే సిబ్బంది విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని మార్క్స్ షీట్‌లను డిజిటల్‌గా ట్యాంపరింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇంకా ఎవరెవరు ఇలా నకిలీ సర్టిఫికెట్స్ తీసుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మరో వైపు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించే ఐటీఐ లిమిటెడ్ అనే డేటా ఎంట్రీ సంస్థకు గౌహతి యూనివర్సిటీ అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. థర్డ్ పార్టీ ఆపరేటర్ ద్వారా డిజిటల్ మార్క్ షీట్ల ట్యాంపరింగ్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. నిందితులైన కే కృష్ణమూర్తి, ఇస్మాయిల్ హుస్సేన్, అలంగీర్ ఖాన్, అబుల్ బాసర్, మొయినుల్ హక్, అమీనుల్ ఇస్లాం, శివతోజ్, హమేజుద్దీన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు మరికొందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.