స్మార్ట్ సిటీ మిషన్ కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. అనంతరం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్నది. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు చేపట్టారు. వరంగల్ లో ఇప్పటివరకు 45 శాతం పనులు పూర్తయ్యాయి. రూ. 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లో 25 శాతం పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన 22 శాతం పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.
స్ట్మార్ట్ సిటీలో చేపట్టిన పనులు పూర్తి కానందున, ప్రజా ప్రయోజనార్థం ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలంటూ కేంద్ర మంత్రిని కోరారు. స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ శనివారం రాష్ట్రానికి లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండబోవని ఆ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ‘ఫస్ట్ కమ్ ఫస్ట్’ పద్ధతిన విడుదల చేస్తాని తెలిపింది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని కేంద్రం సూచించింది.