ఒడిశా రాష్ట్రంపై ఫణి సూపర్ సైక్లోన్ బుసలుకొట్టిన నేపథ్యంలో అక్కడ నీట్ పరీక్షను వాయిదా వేశారు. ఆలిండియా స్థాయి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ షెడ్యూల్ ప్రకారం మే 5న దేశవ్యాప్తంగా జరగనుంది. అయితే, ఫణి తుపాను కారణంగా ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. దాదాపు 12 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.
తుపాను మిగిల్చిన విధ్వంసం నుంచి తేరుకోవాలంటే కొన్ని రోజులు పడుతుందన్న అంచనాల నేపథ్యంలో ఒడిశాలో నీట్ నిర్వహణ కష్టసాధ్యమని తేల్చారు. త్వరలోనే మరో తేదీ ప్రకటించి ఒడిశాలో నీట్ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది.