తెలంగాణ సీఎం కేసీఆర్ గోడ మీద పిల్లిలాంటోడని, ఏపీ సీఎం చంద్రబాబు అవకాశవాదని బీజేపీ నేత దత్తాత్రేయ విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ వీరిద్దరిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచింది కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని దత్తాత్రేయ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచి ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని మండిపడ్డారు. సిట్టింగ్ జడ్జితో ఇంటర్ బోర్డు అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థకు వ్యతిరేకంగా కమిటీ రిపోర్ట్ ఇచ్చినా ఎలాంటి చర్యా తీసుకోలేదని దత్తాత్రేయ విమర్శించారు. ఫెడరల్, మహాకూటములు తమ దరిదాపుల్లోకి కూడా రావన్నారు. టీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని దత్తాత్రేయ పేర్కొన్నారు.