రేపే ఆరో దశ పోలింగ్‌


-59 స్థానాలకు ఎన్నికలు 
– త్రిపురలో 168 కేంద్రాల్లో రీపోలింగ్‌ 
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఆరో దశ పోలింగ్‌ ఆదివారం జరగనున్నది. అందుకు సంబంధించిన ప్రచారం పర్వం శుక్రవారంతో ముగిసింది. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 59 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. ఇప్పటికే దాదాపు 400 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. ఆరో విడతలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు త్రిపురలో వెస్ట్‌ త్రిపుర నియోజకవర్గంలో 168 పోలింగ్‌ బూత్‌ల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేసింది. ఆయా రాష్ట్రాల్లో బిజెపి, కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎస్పీ, బిఎస్పీ చీఫ్‌లు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణముల్‌ అధినేత మమతా బెనార్జీ తదితరులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బిజెపి అభ్యర్ధి, పలు వివాదాల్లో చిక్కుకున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌తో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌ తలపడుతున్నారు. ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌పై ఉగ్రవాద చర్యలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని బంకుర నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున 1980 నుంచి బాసుదేవ్‌ ఆచార్య గెెలుపొందుతూ వచ్చారు. అయితే 2014లో తృణముల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మున్‌మున్‌ సేన్‌ గెలిచారు. అయితే ఈసారి ఆమె మరో స్థానం నుంచి బరిలోకి దిగింది. బంకుర నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది

సిపిఎం, టిఎంసి, కాంగ్రెస్‌, బిజెపి నేతలు తమ అభ్యర్థులు ప్రచార హోరెత్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌ పూర్‌ నియోజకవర్గంలో బిజెపి తరపున కేంద్ర మంత్రి మేనకా గాంధీ గత ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఈసారి ఆమె తనయుడు వరుణ్‌ గాంధీ బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.

బిజెపి, కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ, బిఎస్పీ కూటమి తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఆయా పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల సంఘం ఆమె ప్రచారం చేయకుండా 48 గంటల పాటు నిషేదం విధించింది. దీంతో తన కుమారుని కోసం ప్రచారం చేసే అవకాశం లభించలేదు.

జార్ఖండ్‌లో ధన్‌బాద్‌ నుంచి క్రికెటర్‌, బిజెపి సిట్టింగ్‌ ఎంపి కీర్తి ఆజాద్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి, ఈ సారి కాంగ్రెస్‌ తరపున బరిలో దిగారు. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్‌ తరపున బరిలో దిగారు. ఈస్ట్‌ ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది. ఆమ్‌ఆద్మీ పార్టీ, బిజెపి, కాంగ్రెస్‌ తరపున అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. బిజెపి తరపున క్రికెటర్‌ గౌతం గంభీర్‌, ఆప్‌ తరపున అతిశి, కాంగ్రెస్‌ తరపున అరవిందర్‌ సింగ్‌ లవ్లీ బరిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *