నిద్రలేమితోపాటు అల్పాహారం తీసుకోకుండా ఫ్లైటెక్కిన ఓ పైలట్ మార్గమధ్యంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆయన విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టి స్పృహ కోల్పోయాడు. దీంతో విమానం 40 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ పైలట్ శిక్షణా సంస్థలో మార్చి 9న జరిగిందీ ఘటన. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ఏటీఎస్‌బీ) తాజగా ఓ నివేదికను విడుదల చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ నివేదిక ప్రకారం.. డైమండ్ డీఏ 40 విమానాన్ని నడుపుతున్న ట్రైనీ పైలట్ ముందు రోజు రాత్రి నిద్రపోలేదు. జలుబుతో బాధపడుతున్న అతడు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండానే ప్లైటెక్కాడు. విమానం 5,500 అడుగుల ఎత్తులో నడుపుతుండగా పైలట్‌ను తలనొప్పి బాధించింది. దీంతో ఆటోపైలట్ మోడ్‌ను ఆన్ చేసిన పైలట్ ఆ వెంటనే స్పృహ కోల్పోయాడు. దీంతో విమానం దాదాపు 40 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయింది.
విమానం అకస్మాత్తుగా అడిలైడ్ విమానాశ్రయం నియంత్రణలోని గగన తలంలోకి వచ్చింది. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఎటువంటి సూచనలు ఇవ్వకుండానే విమానం తమ పరిధిలోకి రావడంతో అనుమానం వచ్చిన ఏటీసీ సిబ్బంది పైలట్‌ను పలుమార్లు సంప్రదించారు. అయినప్పటికీ అతడి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అదే సమయంలో ఆ విమానానికి సమీపంలోంచి మరో విమానం వెళ్లడంతో ఆ శబ్దానికి పైలట్‌కు స్పృహ వచ్చింది. దీంతో విమానాన్ని తిరిగి తన అధీనంలోకి తీసుకున్నట్టు ఏటీఎస్‌బీ నివేదిక వెల్లడించింది.