డీలిమిటేషన్ బిల్లు అంశం..! ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు.. హస్తినకు సీఎం చంద్రబాబు..

వచ్చే సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపీ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.

నవంబర్ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఉభయసభల్లో కేంద్రం ప్రవేశ పెట్టనుంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు బీజేపీ పెద్దలు ఈసారి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

శుక్రవారం ఉదయం అమరావతిలో చంద్రబాబు కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు పిలుపు వచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. సాయంత్రానికి ఢిల్లీకి రావాలన్నది కీలకమైన పాయింట్. కేబినెట్ భేటీ తర్వాత ఇరువురు నేతలు ఢిల్లీకి బయలు దేరనున్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు భాగస్వామ్య పక్షాలతో బీజేపీ సమావేశం అవుతోంది. సాయంత్రం లేకుంటే ఉదయం ఎన్డీయే కీలక నేతలు భేటీ కానున్నారు. గతంలో ఒకసారి ఆ బిల్లులు వీగిపోవడంతో ఈసారి ఛాన్స్ లేకుండా జాగ్రత్తగా పావులు కదుపుతోంది.  ఇప్పటికే దీనికి కావాల్సిన సంఖ్యాబలం బీజేపీ చేరుకుంది. ఈ బిల్లుల చర్చ కోసం నాలుగు రోజులు కేటాయించారు. వీటిపై లోక్‌సభ, రాజ్యసభలో రెండేసి రోజుల చొప్పున చర్చ జరగనుంది. అవసరమైతే మరొక రోజు చర్చకు కేటాయించాలని భావిస్తోంది.

ఏపీ విభజన సమయంలో అసెంబ్లీ సీట్లు పెరగాల్సివుంది. ఆ విషయం విభజన చట్టంలో ఉంది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో దాదాపు పుష్కరకాలం డిలే అవుతూ వచ్చింది. ఒకేసారి 50 శాతం సీట్లు పెంచాలని భావిస్తున్న తరుణంలో ఎంపీ సీట్లు 38కి చేరే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సీట్లు 175 నుంచి 260 వరకు పెరిగే అవకాశం ఉందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతలు శనివారం హస్తినలో ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.