మద్దిమడుగు సభలో లంబాడీలకు సీఎం రేవంత్ సంచలన హామీలు..!

నాగర్‌కర్నూల్ జిల్లాలోని మద్దిమడుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ,అడ్లూరి లక్ష్మణ్,వాకిటి శ్రీహరి చేరుకున్నారు. అనంతరం మద్దిమడుగులో శ్రీ పెబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హరిత హోటల్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.18 కోట్లతో మద్దిమడుగు శ్రీ పెబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం ప్రసంగించారు.

అనంతపురంలో జన్మించిన సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక మంచి సన్మార్గాన్ని చూపించారని, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని సేవాలాల్ మహారాజ్ సూచించారని అన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ఆదర్శమూర్తిగా నిలబడ్డారు. లంబాడాలందరికీ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొన్ని పార్టీలు లంబాడా సోదరులను ఓట్లు వేసే యంత్రాలుగా, రాజకీయ అవసరాలకు ఉపయోగపడేవారిగా చూశాయని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ మాత్రమే లంబాడా సోదరుల పోరాటపటిమను గుర్తించి సమాన అవకాశాలు కల్పించారని అన్నారు.

ఆనాడు బ్రిటిష్ దొరలను గడగడలాడించిన జాతి లంబాడా జాతి.. నిజాం నవాబును ఎదుర్కొన్న జాతి.. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తండాల్లో ఆశ్రయం ఇచ్చిన జాతి అని, నమ్మితే ప్రాణాలు ఇచ్చే జాతి లంబాడా జాతి బలహీన వర్గాల్లో ఉన్న లంబాడాల ఆర్థిక వెనుకబాటుతనాన్ని చూసి జైపాల్ రెడ్డి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి తీసుకెళ్లి 1976లో వారిని షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో చేర్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రిజర్వేషన్ల కారణంగా లంబాడాలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అనేక ఉన్నతస్థాయి ఉద్యోగాలు పొందారు. నాయకులుగా అనేక పదవులు సాధించారు. లంబాడాలు మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారని అన్నారు.

దున్నేవాడికే భూములు ఇవ్వాలన్న ఉద్దేశంతో 12 లక్షల ఎకరాలను ఇందిరాగాంధీ లంబాడా సోదరులకు పంపిణీ చేశారు. ప్రతి లంబాడా ఇంట్లో ఇందిరమ్మ బొమ్మ సంత్ సేవాలాల్ పక్కన కనిపిస్తుందని, ఆ కుటుంబంపై ప్రేమతో అప్పటి తరం వారు ఇందిరమ్మ పేరు, ఈ తరం వారు ప్రియాంక పేరు పెట్టుకుంటున్నారని అన్నారు. లంబాడీలకు ఇచ్చిన గుర్తింపునకు విశ్వాసం చూపిస్తూ వారి పేర్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే అందులో 4 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీలకే అందాయని, ఎస్సీ, ఎస్టీలు పక్కా ఇళ్లు కట్టుకుని ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు.

3.40 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తే అందులో అత్యధికంగా లంబాడీలు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అత్యధికం గిరిజన, ఆదివాసీ సోదరులకే అందుతున్నాయి. అచ్చంపేట, నల్లమల నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఈ ప్రాంత బిడ్డనని చెప్పుకున్నప్పుడల్లా నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాట ఇస్తే ఆ మాట కోసం మట్టిలో కలిసిపోయినా సరే నిలబెట్టుకునే తత్వం ఈ ప్రాంతం నుంచే అబ్బిందని, ప్రచార సమయంలో వంశీకృష్ణను గెలిపిస్తే అచ్చంపేటకు ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారని ఆనాడు చెప్పానని, ఇప్పుడు రూ.450 కోట్ల నిధులను అచ్చంపేటకు తీసుకువచ్చానని అన్నారు.

ప్రస్తుతం ఉన్న 16 ఎకరాలకు మరో నాలుగు ఎకరాలు సేకరించి మొత్తం 20 ఎకరాల్లో దేశానికే తలమానికమైన సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లంబాడా సోదరులు పార్టీకి అండగా నిలబడాలి. లంబాడాల ఉద్యోగ, ఉపాధి, అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా లంబాడా సోదరుడిని నియమిస్తామని రాజకీయాల్లో మీకు రావాల్సిన కోటాను ఢిల్లీకి వెళ్లి తీసుకువస్తామని లంబాడా సోదరుల పాలన, అభ్యున్నతికి పాటుపడతామని సీఎం రేవంత్ రెడ్డి రక్లారిటీ ఇచ్చారు.