ధ్రువ ప్రాంతమైన అంటార్కిటికా అనగానే కనుచూపు మేర విస్తరించిన మంచు ఎడారే గుర్తొస్తుంది. అయితే, ఆ తెల్లటి మంచు దుప్పటి కింద కోట్లాది సంవత్సరాల నాటి అద్భుత ప్రపంచం దాగుంది. హిమాలయాలతో పోటీపడే భారీ పర్వత శ్రేణులు అంటార్కిటికా మంచు అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సూపర్ మౌంటెన్స్ కేవలం రాతి గుట్టలు మాత్రమే కావు.. భూమిపై జీవకోటి పుట్టుకను, విస్తరణను మలుపు తిప్పిన అద్భుత సృష్టి రహస్యాలని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
భూమిని తాకిన పెను కుదుపులు
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్యూ), జర్మనీకి చెందిన జీఎఫ్జెడ్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనను సాగించారు. వీరి పరిశోధనా వివరాలు ‘ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సుమారు 65 కోట్ల నుంచి 45 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భారీ పర్వతాలు ఉద్భవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ కాలంలో అంటార్కిటికా ఖండం భారత్, ఆఫ్రికాలతో ఢీకొట్టడం వల్ల ‘గోండ్వానా’ అనే మహా భూభాగం ఏర్పడింది. అంటార్కిటికా చరిత్రలోనే అత్యంత భారీ పర్వత నిర్మాణ ప్రక్రియ ఇది అని పరిశోధకులు నిర్ధారించారు.
మంచు కింద రహస్యాన్ని పట్టిన స్ఫటికాలు
అంటార్కిటికాలో 99.5 శాతానికి పైగా భూభాగం దట్టమైన మంచుతో కప్పి ఉండటంతో అక్కడి శిలలను నేరుగా పరిశీలించడం అసాధ్యం. దాంతో తీర ప్రాంతాల్లో సాగించిన మహాసముద్ర డ్రిల్లింగ్ ద్వారా సేకరించిన నమూనాల నుంచి 1,712 సూక్ష్మ ఖనిజ రేణువులను (జిర్కాన్స్) శాస్త్రవేత్తలు వేరుచేశారు. ఈ సూక్ష్మ స్ఫటికాల వయసు, రసాయన మూలకాలను క్షుణ్ణంగా విశ్లేషించి, ఆనాడు అక్కడ విలసిల్లిన పర్వతాల చరిత్రను సరిగ్గా లెక్కగట్టారు.
జీవజాలానికి ప్రాణం పోసిన పర్వతాలు
ఈ సూపర్ పర్వతాలు ఏర్పడిన కాలం భూమిపై జీవ పరిణామ క్రమంలో అత్యంత కీలకమైన మలుపుతో సరిగ్గా సరిపోలింది. సుమారు 53.9 కోట్ల ఏళ్ల క్రితం కర్పరం (షెల్) కలిగిన మొదటి జీవులు ఉద్భవించాయి. ఆ తర్వాత 10 నుంచి 30 మిలియన్ ఏళ్లకు భూమిపై రకరకాల జీవజాలం ఊహించని రీతిలో పెరిగిన ‘కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్’ సంభవించింది. గాలి, వర్షాల వల్ల ఈ పర్వతాలు క్రమక్షయానికి గురైనప్పుడు అపారమైన పోషకాలు సముద్రాల్లోకి చేరాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తగ్గి, ఆక్సిజన్ స్థాయులు భారీగా పెరిగాయి. నదుల ద్వారా కార్బన్ నిల్వలు ఏర్పడి, జీవజాలం వేగంగా ఎదగడానికి అవసరమైన అనుకూల పరిస్థితులు సిద్ధమయ్యాయి.