తెలంగాణ గడ్డపై జరిగిన ‘భారత్ సమ్మిట్’ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, నియంతృత్వ ధోరణులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం నేడు ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్లో జరిగిన ఈ సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం వారిలో చాలామందికి వీసాలను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, ప్రపంచ దేశాలన్నీ మనల్ని నిశితంగా గమనిస్తున్నాయని, ఈ ఆంక్షలు మనల్ని ఏమాత్రం ఆపలేవని ఆయన తేల్చిచెప్పారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా రెండు విభిన్న శక్తుల మధ్య పోరాటం జరుగుతోందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను కోరుకునే వర్గం ఉంటే.. మరోవైపు వాటిని ధ్వంసం చేసి నియంతృత్వాన్ని రుద్దాలని చూసే మరో శక్తి ఉందని విమర్శించారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని తాము కోరుకుంటుంటే, ప్రత్యర్థులు మాత్రం తమకు నచ్చిన కొద్దిమంది వర్గాలకే ఆ హక్కు కల్పించాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
కేవలం సంపన్న మిత్రులను కాపాడుకోవడం, కొద్దిమంది చేతుల్లోనే అధికారాన్ని కేంద్రీకరించడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారని సీఎం ఆరోపించారు. కానీ, ప్రభుత్వాలు సంపన్నుల కోసం కాకుండా పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులు వంటి సామాన్య ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఈ ప్రజాస్వామ్య పోరాటానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రతి పౌరుడి ఓటు హక్కు కోసం, దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు సామాజిక న్యాయం అందించడం కోసం ఆయన పోరాడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశంలో సమూల మార్పు వస్తుందని, ఈ గొప్ప లక్ష్యం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన కోరారు.