భారతీయ రాజకీయాల్లో సరికొత్త రణక్షేత్రానికి రంగం..!

భారతీయ రాజకీయాల్లో సరికొత్త రణక్షేత్రానికి రంగం సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల పోరు తర్వాత.. ప్రతిపక్షాల ఇండియా కూటమికి, అధికార బీజేపీకి మధ్య అసలైన అగ్నిపరీక్ష అతి త్వరలో జరగబోతోంది. వచ్చే ఏడాది మార్చిలోనే.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయ్. దాంతో.. పొలిటికల్ డైనమిక్స్ వేగంగా మారిపోతున్నాయ్. 2027 ఫిబ్రవరిలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్.. మార్చిలో రాజకీయకంగా అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీలకు ఎన్నికల ఘట్టం పూర్తి కావాల్సి ఉంది. దాంతో.. దేశ రాజధానిలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలే.. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి మనుగడను, దాని భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయ్. ఇందులో మరో డౌట్ అక్కర్లేదు.

 

ఇప్పటికే.. ఢిల్లీ గడ్డపై.. లక్షలాది మందితో ప్రతిపక్షాలు నిర్వహించిన భారీ ఓట్ బచావ్ ర్యాలీ.. దేశవ్యాప్తంగా ఓ పొలిటికల్ వైబ్రేషన్‌ని క్రియేట్ చేసింది. ఆ ర్యాలీలో కనిపించిన జనం, ఆ నినాదాలు, ఆవేశమంతా.. రాబోయే 5 రాష్ట్రాల పోరులో.. ఓట్ల రూపంలో మారుతుందా? లేక.. ర్యాలీలకు, సోషల్ మీడియాలో హడావుడికే పరిమితమవుతుందా? అనేదే.. బిగ్గెస్ట్ క్వశ్చన్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయ్. మరోవైపు.. ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని ర్యాలీలు నిర్వహించినా.. మరోసారి ప్రతిపక్షానికే పరిమితం చేయడం ఖాయం అంటూ బీజేపీ మాస్టర్ మైండ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇండియా కూటమిలోని పార్టీల పర్ఫార్మెన్స్, సీట్ల షేరింగ్ లెక్కలు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను.. ఓట్లుగా మలచుకోవడంలో వారి సామర్థ్యమే ఫ్యూచర్ పాలిటిక్స్‌ని డిసైడ్ చేస్తుంది. బీజేపీని గద్దె దించే సత్తా ప్రతిపక్షాలకు ఉందా? లేక మోడీ, షా ద్వయం స్ట్రాటజీల ముందు.. విపక్షాల జోరు నీరుగారిపోతుందా? అనేది తేలాలంటే.. కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.

ఇంకొన్ని నెలల్లో.. దేశ రాజకీయాలను కుదిపేయబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల సమరం ఎలా ఉండబోతోందన్నది ఇప్పటి నుంచే ఉత్కంఠ రేపుతోంది. అధికారాన్ని కాపాడుకొని, పట్టు నిలుపుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫైవ్ స్టేట్స్ ఎన్నికల రిజల్ట్స్‌‌తోనే.. తమ పొలిటికల్ రీఎంట్రీ గ్యారెంటీ అంటోంది ఇండియా కూటమి. ఈ పొలిటికల్ చెస్ బోర్డులో.. ఏ పార్టీ ఎలాంటి పావులు కదుపుతుంది? ఎలాంటి అడుగులు వేస్తుంది? ఏవిధమైన వ్యూహానికి తెరలేపుతుందన్నది టైమ్ డిసైడ్ చేస్తుంది.