కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన స్థానిక ఎన్నికల పోలింగ్ సరళిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రతి దశలోనూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. రిగ్గింగ్ అనే దానికి కూటమి ప్రభుత్వం ఒక కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు సౌత్ బిహార్ రాజకీయాలను గుర్తుకు తెస్తోందని ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయనీయకుండా, ప్రజలను ఓటేయనీయకుండా భయాందోళనలు సృష్టించారని షర్మిల దుయ్యబట్టారు.
జనాల్లో మద్దతు లేకపోవడంతోనే కూటమి నాయకులు స్థానిక ఎన్నికల్లో అడ్డదారులు తొక్కారని షర్మిల ఆరోపించారు. ‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా కూటమి పరిస్థితి తయారైంది. స్వతంత్రంగా గెలిచే సత్తా లేక బూత్ క్యాప్చరింగ్‌లు, దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నించారు. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వంలో ఉన్న ఓటమి భయానికి ఇది అద్దం పడుతోంది. ఒకవైపు పారదర్శకత అని నీతులు చెబుతూ.. మరోవైపు విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?’ అని షర్మిల ప్రశ్నించారు.
‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించలేకపోయిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. వ్యవస్థలను బానిసలుగా మార్చుకుని ప్రజల తీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఇది దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని అభివర్ణించారు. నిజంగా ప్రజాబలమే ఉంటే ఇన్ని దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లు చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వస్తుందని కూటమి నేతలను నిలదీశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి డిమాండ్లు
ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోల ఆధారాలు ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో తక్షణమే ఎన్నికను రద్దు చేసి, రీ-పోలింగ్ పెట్టాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోని లైవ్ వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ ఫుటేజ్‌లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని ఓటర్లు కాకుండా ఇతరులు లోపలికి వెళ్లి ప్రభావితం చేసినట్లు తేలితే ఆయా బూత్‌ల ఫలితాలను నిలిపివేయాలని పట్టుబట్టారు. మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి అక్రమాలను అడ్డుకోక చూస్తూ ఊరుకున్న రిటర్నింగ్ అధికారులు (ROs), ప్రిసైడింగ్ అధికారులు (POs), సంబంధిత పోలీసులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు