మియాపూర్ భూముల తీర్పుపై మీడియాతో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

మియాపూర్ లోని 550 ఎకరాల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపిాంచి రూ. 50 వేల కోట్ల ఆస్తిని కాపాడుకో గలిగామన్నారు.

మియాపూర్ భూముల వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపాడిన భూముల చిట్టా అంతా బయటపెట్టారు. ఈ భూములను కొల్ల గొట్టేందుకు కేసీఆర్, ఆయన బంధువులు అనేక రకాలుగా ప్రయత్నించారని తెలిపారు. ఈ భూములను ఆక్రమించుకునేందుకు కొందరు రకరకాలుగా ప్రయత్నించారని తెలిపారు.

ముఖ్యంగా గోల్డ్ స్టోన్ సంస్థ చేయని ప్రయత్నాలు లేవన్నారు. ఈ భూముల విషయంలోనే దామోదరరావుకు గోల్డ్ స్టోన్ సంస్థ ప్రసాదరావు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారన్నారు. కొందరు అధికారులను అడ్డం పెట్టుకుని భూములను కొట్టేయాలని చూశారని దుయ్యబట్టారు. ఈ భూముల విషయంలో కొందరు అధికారులు అరెస్టయిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు.

న్యాయస్థానం నుంచి తీర్పు రాగానే ఆయా భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారలను ఆదేశించినట్టు తెలిపారు. అవసరమైతే ఈ భూములను వేలం వేసి దళిత, బహుజనుల కోసం ఖర్చు చేస్తామని తేల్చేశారు. మంచిరేవులలో 143 ఎకరాలను కాపాడామని తెలియజేశారు. ఎల్బీనగర్ లో 150 ఎకరాల భూములను అటవీ ప్రాంతంగా మార్చామన్నారు. మొత్తానికి లక్షా 50 వేల కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి కాపాడామన్నారు.

ఆయా భూములను ఇలా వదిలేస్తే కేసీఆర్ ముఠా మళ్లీ కబ్జా చేస్తోందని మనసులోని మాట బయటపెట్టారు. స్వాధీనం చేసుకున్న భూములను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తామన్నారు. భూకబ్జాకు ప్రయత్నిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తేల్చేశారు. ఈ భూములను విక్రయించి నీటి పారుదల, విద్యా-వైద్య వంటి రంగాలకు నిధులను కేటాయిస్తామన్నారు. ఈ భూముల వినియోగంపై కేబినెట్ లో చర్చిస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చించి చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు.