ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్-బద్రీనాథ్ మార్గంలో ఆరుగురితో వెళ్తున్న ఒక హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలెట్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించారు.
అంతకుముందు బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌లోని సహస్రధారకు బయలుదేరిన ‘ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్’కు చెందిన హెలికాప్టర్ (VT-HCX) మధ్యాహ్నం 1:14 గంటల సమయంలో మంచు కురుస్తున్న సమయంలో టేకాఫ్ అయింది. అయితే జోషిమఠ్ లోయలో హాథీ పర్వతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో కమ్యూనికేషన్ తెగిపోయింది. అదే సమయంలో ట్రాకింగ్ సిస్టమ్ నుండి కూడా హెలికాప్టర్ సంకేతాలు నిలిచిపోయినట్లు ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది.
ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్‌తో సహా మొత్తం ఆరుగురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని పైలట్ కెప్టెన్ హిమాంశుతో పాటు ప్రతాప, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్. కె, హెచ్.ఎస్. నటరాజగా గుర్తించారు. జోషిమఠ్ సమీపంలోని ఛాయీ గ్రామం వద్ద హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఆర్మీ, జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా ఎయిర్‌లిఫ్ట్ చేయాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికారులను ఆదేశించారు. మరోవైపు జోషిమఠ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ వశిష్ఠ్ తమ బృందంతో కలిసి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో ‘ట్రాన్స్ భారత్ ఏవియేషన్’ సంస్థకు చెందిన మిగతా అన్ని హెలికాప్టర్ల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరాఖండ్ భౌగోళిక పరిస్థితులు, హఠాత్తుగా మారే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో సుమారు 12 హెలికాప్టర్ సంబంధిత ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఐదు ప్రాణాంతకమైన ప్రమాదాలు కాగా.. ఏడు అత్యవసర ల్యాండింగ్‌లు, గాయాలతో బయటపడ్డ ఘటనలు. గతేడాది జూన్‌లో కూడా కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.