శ్రీహరికోటలోని షార్‌ మరో కీలక ప్రయోగం..!..

శ్రీహరికోటలోని షార్‌ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అమెరికా GPSపై ఆధారపడకుండా భారత్‌ సొంతంగా అభివృద్ధి చేస్తున్న నావిక్‌ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు NVS-03 ఉపగ్రహాన్ని GSLV-F18 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. రాత్రి 11:51 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుండగా.. 24 గంటల పాటు కొనసాగనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగం విజయవంతమైతే దేశంలోనే కాకుండా సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల పరిధి వరకు మరింత ఖచ్చితమైన నావిగేషన్‌ సేవలు అందించే సామర్థ్యం పెరగనుంది.

అంటే ఇది కేవలం మరో ఉపగ్రహ ప్రయోగం కాదు.. దేశ రక్షణ, రవాణా, కమ్యూనికేషన్‌, అత్యవసర సేవలకు అవసరమైన నావిగేషన్‌ వ్యవస్థలో భారత్‌ సెల్ఫ్‌ రిలయన్స్‌కు మరో అడుగు. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌ శాస్త్రవేత్తలతో కలిసి చెంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. తిరుమలలోనూ రాకెట్‌ నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు. మరి NVS-03 విజయంతో నావిక్‌ సేవలు ఎంత బలోపేతం కానున్నాయి? అమెరికా GPSకు ప్రత్యామ్నాయంగా భారత్‌ సొంత నావిగేషన్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎప్పుడు నిలబడనుంది? అనే ప్రశ్నలు ఉత్కంఠగా మారాయి.