నెగటివ్ ప్రచారం..! పోలీసులను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్..

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్)పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వారి టీమ్ తీవ్రంగా స్పందించింది. కొంతకాలంగా వీరిద్దరిపై కొందరు ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తూ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం నాడు అధికారికంగా ఫిర్యాదు చేసింది. తమ హీరో, హీరోయిన్ల గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, చట్టపరంగా ఎంతవరకైనా వెళతామని వారి టీమ్ స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే…

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తరఫున వారి ప్రతినిధులు సైబర్ క్రైమ్ డీసీపీని కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో గతంలో విజయ్, రష్మిక చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుడు అర్థాలు వచ్చేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఉద్దేశపూర్వక దుష్ప్రచారం తీవ్రమైన అసౌకర్యం, మానసిక వేదన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భావ ప్రకటనా స్వేచ్ఛను, నిర్మాణాత్మక విమర్శలను తాము గౌరవిస్తామని, కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడాన్ని సహించబోమని విజయ్-రష్మిక టీమ్ స్పష్టం చేసింది. ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు, స్క్రీన్‌షాట్‌లు, ఇతర కీలక ఆధారాలను పోలీసులకు సమర్పించింది. ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ అధికారులు, ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇటీవల విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో రష్మికతో ఉన్న ఒక రొమాంటిక్ వీడియోను షేర్ చేస్తూ, ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చారు. ఆ పోస్టులో రష్మికను తన “ఆత్మసఖి, భార్య, స్నేహితురాలు” అని అభివర్ణించారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమ వ్యక్తిగత జీవితాలపై, కుటుంబ విషయాలపై వ్యాఖ్యలు చేయడం ‘ఫెమినిజం’ ముసుగులో వేధించడమేనని ఆయన మండిపడ్డారు.