మహారాష్ట్ర ఓటర్ల జాబితా వివాదం.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..!

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మహారాష్ట్రలో చేపట్టిన ఎస్​ఐఆర్​ ప్రక్రియలో క్లెయిమ్​ లు, అభ్యంతరాల దాఖలుకు తుది గడువును పొడిగించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మహారాష్ట్రలో జరుపుతున్న ఎస్​ఐఆర్​ లో దాదాపు 33శాతం మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారంటూ అరుణ్​ ఆనందగిరి అనే వ్యక్తి పిటిషన్​ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ జోయ్​ మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ.మోమనతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్​ అరవింద్ దాతార వాదనలు వినిపించారు. ముంబై, పూణె నగరాల్లో దాదాపు మూడున్నర వేల పునరాభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నట్టు తెలిపారు. పాత కాలనీల కూల్చివేతల వల్ల వేలాదిమంది వేరే ప్రాంతాలకు తర​లి వెళ్లిపోయినట్టు చెప్పారు. చిరునామాల వివరాలు సరిపోవటం లేదన్న కారణంపై వారి పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించే ప్రమాదం ఉందన్నారు. నేటితో ముగియనున్న క్లెయిమ్​ లు, అభ్యంతరాల గడువును పొడిగించాలని కోరారు. ఈ మేరకు తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. కాగా, ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.