వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్‌పై విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో “రా. కదలి రా” కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనర్హులకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం అయిందన్నారు. టీడీపీ పెట్టే సభలకు వచ్చే జన సునామిని చూసి తాడేపల్లిలో ఉన్న పిల్లి వణుకుతుందన్నారు. నంద్యాల జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నమన్నారు . శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా అని, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ ప్రాంతం ఇక్కడే ఉందని గుర్తు చేశారు. జగన్ పాలనలో ఆంధ్రరాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటుందని చంద్రబాబు నాయుడు అగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనకు పరిశ్రమలు మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు ఆరోపించారు. మన పొలాల్లో జగన్ బొమ్మలేంటి? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏమి చేశారని వైసీసీ యాత్రలు చేపట్టిందని ప్రశ్నించారు. కర్నూల్ జిల్లాకు పరిశ్రమలు తెచ్చిన ఘనత టీడీపీకే చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.