కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన మద్దతు లేకుండానే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందంటూ న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే ప్రభుత్వ ధనానికి చట్టపరమైన అనుమతులు ఉండాలని విజయ్ గోపాల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ రండు పథకాలకు అలాంటి అనుమతులు లేవని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
నిజానికి దీనిపై సమీక్ష జరపాలని అభ్యర్థిస్తూ గతంలోనే తెలంగాణ హైకోర్టులో విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకాల కింద ప్రభుత్వం ఇప్పటివరకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొంటూ వాటి రాజ్యాంగబద్దతను పరిశీలించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం తరపున ఎలాంటి కౌంటర్లు దాఖలు కాకపోవటంతో ఎనిమిది జీవోలపై ఆగస్టు 12న స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ రెండు పథకాల కింద ఎలాంటి చెల్లింపులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
దీనిని ప్రభుత్వం.. హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ జారీ చేసిన స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తూ సెప్టెంబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి కోర్టులో ఉన్న పిటిషన్ పై విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ విజయ్ గోపాల్ దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనంలో పిటిషన్ వేశారు.
అయితే, హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 1న జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవటానికి ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ బెంచ్ కోర్టు ముందున్న విచారణను నిలిపివేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.