ప్రపంచవ్యాప్తంగా ఏఐ జోరు విపరీతంగా పెరిగిపోతోంది. అన్ని రంగాల్లోనూ ఇదే ఇప్పుడు ట్రెండ్. కానీ, ఈ టెక్నాలజీ వల్ల మన పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏఐ అనగానే మనకు కేవలం కరెంట్ ఖర్చు, నీటి వినియోగం, కార్బన్ ఉద్గారాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, వీటితో పాటు మరో పెద్ద సమస్య చుట్టుముడుతోంది. అదే ‘హీట్ ఐలాండ్’ అనర్థం.
లక్షల కొద్దీ సర్వర్లతో నడిచే ఏఐ డేటా సెంటర్లు విపరీతమైన వేడిని బయటికి వదులుతాయి. దీనివల్ల ఆ డేటా సెంటర్లు ఉండే చుట్టుపక్కల ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆ ప్రాంతాల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ భారీ సర్వర్లను చల్లబరచడానికి టెక్ కంపెనీలు రోజుకు లక్షలాది గ్యాలన్ల నీటిని వాడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉండే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లను ఎలా డిజైన్ చేయాలి? ఎక్కడ ఏర్పాటు చేయాలి? అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది.
కేవలం టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూపోతే సరిపోదు.. దానికి తగ్గట్టుగా సస్టైనబిలిటీని కూడా పాటించాలి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా డేటా సెంటర్ల నిర్మాణం ఉండేలా ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాల్. రాబోయే రోజుల్లో ఏఐ ఫ్యూచర్ బాగుండాలంటే.. ఈ పర్యావరణ భారాన్ని తగ్గించే పక్కా ప్లానింగ్ ఇప్పుడే మొదలుపెట్టాలి.