ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగం, గృహావసరాలు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా పటిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఎల్నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంగళవారం ప్రజాభవన్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఆకస్మిక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు, సరఫరా సంసిద్ధత, బొగ్గు లభ్యత, అవసరమైన వనరుల సమీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయానికి, గృహావసరాలకు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను తగిన స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైతే కోల్ ఇండియా నుంచి అదనంగా బొగ్గును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బొగ్గు కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని, నిధుల విషయంలో ఎలాంటి కొరత ఉండదని స్పష్టం చేశారు.