హైదరాబాద్‌కు జగన్ మకాం..! జగన్ అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్..!

హైదరాబాద్‌కు వైసీపీ అధినేత జగన్ మకాం మార్చనున్నారా? ఈ నెలాఖరుకు అంతా రెడీ చేసుకుంటున్నారా? ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో మకాం పెట్టాలని ప్లాన్ చేశారా? అందుకు కాలం కూడా సహకరించిందా? కేసుల రూపంలో ఇన్నాళ్లకు సాధ్యమైందా? ప్రతీరోజూ ఆయన న్యాయస్థానానికి హాజరుకానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

వైసీపీ అధినేత జగన్ మకాం మార్చే సమయం ఆసన్నమైంది. ఆ విషయంలో అన్ని రకాలుగా సహకారం అందుతోంది. అక్టోబర్ తప్పితే నవంబర్‌లో ఆయన మకాం పెట్టడం ఖాయమని అంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా బుధవారం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన ఆస్తుల కేసులకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ విచారణకు చేపట్టాలని డిసైడ్ అయ్యింది. సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసులను రోజువారీ విచారించనుంది.

ఇప్పటికే రోజువారీ విచారణకు హాజరు కావాలని ఈడీ న్యాయవాదులకు సూచన చేసింది. దాదాపు  పదేళ్లుగా సీబీఐ కోర్టులో ఆస్తుల కేసుల కేసు పెండింగ్‌లో పడింది. పదేళ్లుగా 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్‌లో పడ్డాయి. డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో ఈడీ కేసుల విచారణ ముందుకు కదలలేదు. ఈ క్రమంలో ఈడీ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టును ఆశ్రయించారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించిన పిటిషన్ రేపో మాపో విచారణకు రానుంది. ఇప్పటి వరకు సీబీఐ కేసులను న్యాయస్థానం విచారణ చేస్తోంది.

ఇకపై తమ కేసులను విచారించాలని ఈడీ పిటిషన్‌ వేసింది. ఈ కేసు త్వరగా తేల్చేలా సీబీఐ న్యాయస్థానాన్ని ఆదేశించాలని ప్రస్తావించింది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి ఈడీ కేసులను సీబీఐ కోర్టు విచారించనుంది. ఈ కేసుల్లో జగన్‌తోపాటు మరో 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించాలని డిసైడ్ అయ్యింది న్యాయస్థానం. జరుగుతున్న పరిణామాలతో చూస్తుంటే జగన్ కేసు విచారణ వేగవంతం కానుంది. అదే జరిగితే రోజువారీ విచారణల కోసం వైసీపీ అధినేత జగన్, హైదరాబాద్ కు మకాం మార్చే అవకాశం ఉంది.