స్టార్‌లింక్ అనుమతుల విషయంలో ఎలాన్ మస్క్ తన విమర్శల దాడిని మరింత పెంచారు. తొలుత పేర్లు ప్రస్తావించకుండా.. కొందరు సంపన్నులు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భారత ప్రజలపై గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారని.. ఇది ప్రజలకు అన్యాయం చేయడమేనని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భారతదేశం నుంచి రాజకీయ నాయకుల నుంచి మద్దతు రావడంతో.. డైరెక్ట్ అటాక్ ప్రారంభించారు ఎలాన్ మస్క్. ముఖేశ్ అంబానీని నేరుగా టార్గెట్ చేశారు. స్టార్‌లింక్ 165కిపైగా దేశాల్లో సేవలు అందిస్తోందని.. భారత్‌లో ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అయినా సేవలు ప్రారంభించేందుకు ఇంకా ఎందుకు అనుమతి రావడం లేదని ప్రశ్నించారు. భారత్‌కి నిజమైన బాస్ అంబానీయేనా అంటూ వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.
శుక్రవారం మరో పోస్టుతో మస్క్ అంబానీపై విమర్శల దాడిని పెంచారు. డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ అంటూ సెటైర్ వేశారు. భారత్‌కి నిజమైన బాస్ అని గుర్తించలేకపోయినందుకు క్షమించండి అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. భారత ప్రజలపై గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటున్నారని ఆరోపిస్తూ.. స్టార్‌లింక్‌ను కూడా పోటీకి అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలు ఉపయోగపడతాయని మస్క్ పేర్కొన్నారు.
ఇంతటితో ఆగకుండా.. BJPకి ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చినట్లు పేపర్ క్లిప్పింగ్స్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. 2022లోని అల్ జజీరా, 2024లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనాలను పోస్ట్ చేశారాయన. రిలయన్స్‌తో సంబంధాలున్నట్లు ఆ కథనాల్లో పేర్కొన్న క్విక్ సప్లై సంస్థ ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి, శివసేనకు విరాళాలు ఇచ్చినట్లు వివరించారు. ఈ కథనాలను స్టార్‌లింక్ వివాదం మధ్య మస్క్ షేర్ చేయడంతో అంబానీపై ఆయన విమర్శలు మరోసారి చర్చకు వచ్చాయి.
స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతుల జాప్యంపై మొదలైన వివాదం.. అంబానీపై నేరుగా విమర్శలు, ఆ తర్వాత బీజేపీకి విరాళాల వరకు వెళ్లింది. రానున్న రోజుల్లో ఈ విమర్శలు ఎటువైపు వెళ్తాయన్నది ఆసక్తిగా మారింది.