తెలంగాణలో హైస్పీడ్ ట్రైన్ కారిడార్లపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. రైలు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చిచెప్పారు. మూడు మార్గాలకు సంబంధించి అలైన్మెంట్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసలు ఏం జరిగింది?
శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి-అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఆయా మంత్రుల మధ్య తెలంగాణలో హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రాజెక్టు సంబంధించి చర్చించారు. హైస్పీడ్ రైలు కారిడార్ ప్రతిపాదనలు, అలైన్మెంట్, అధ్యయనాల పురోగతి, తెలంగాణలో రైతుల ఆందోళనలపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ ద్వారా వెల్లడించారు.
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో హైస్పీడ్ ట్రైన్ మార్గాల కోసం క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులు చేయడం రైతుల్లో ఆందోళన నెలకొందని రైల్వే మంత్రికి కిషన్‌రెడ్డి వివరించినట్లు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతామనే భయం పలువురు రైతుల్లో ఉందన్నారు. ఈ విషయం తనను కలిసి సమస్యలను వివరించారని పేర్కొన్నారు. ప్రాథమికంగా రెడీ చేసిన అలైన్మెంట్లో సూర్యాపేటను చేర్చినా ఆ తర్వాత పలు మార్పులు చోటుచేసుకున్నాయి.
మా ప్రాంతం మీదుగా హైస్పీడ్ రైలు నడపాలని సూర్యాపేట ప్రజలు తనను సంప్రదిస్తున్నారని వివరించారు. భూసేకరణపై క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని ప్రస్తావించారు. అలైన్మెంట్ ఖరారు కాకముందే భూముల గుర్తింపు, మార్కింగ్ ప్రక్రియపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో రైతులు అనుమానాలకు కారణమైంది. తెలంగాణలో మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్లపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైభవ్ తెలిపారు.
ఆయా రూట్లు ఖరారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం-రైతులకు వివరాలు తెలియజేస్తామన్నారు. ఈ విషయాన్ని కిషన్‌రెడ్డి స్వయంగా పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోకముందు భూసేకరణ జరపడం చట్టవిరుద్ధం అవుతుందన్నారు. ఇంతకీ తెలంగాణలో మూడు హైస్పీడ్ రైలు కారిడార్ ఏంటి? హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు , హైదరాబాద్ టు ముంబై హైస్పీడ్ రైలు కారిడార్లు ఉన్నాయి. వీటికి సంబంధించి భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు రైల్వే మంత్రి. ప్రస్తుతం అలైన్మెంట్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్రమంత్రి ప్రకటనతో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల్లో నెలకొన్న అనుమానాలకు బ్రేక్ పడినట్లయ్యింది.