జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు..! ఈడీ పిటిషన్..!

జగన్ అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసింది ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. రోజువారీ విచారణ కోసం జగన్‌‌తోపాటు నిందితులను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలని ఈడీ పేర్కొంది. దీంతో వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైంది.

జగన్ అక్రమాస్తుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ కేసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. రోజువారీ విచారణ జరిపి వేగంగా తేల్చాలని అందులో దాఖలు చేసింది. విచారణ సమయంలో జగన్ తోపాటు మిగతా నిందితులు అంతా వ్యక్తిగతంగా హాజరయ్యేలా చూడాలని ప్రస్తావించింది. సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జిషీట్లు గడిచిన పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు తేలకపోవడంతో ఈ కేసు విచారణ ముందుకు వెళ్లడం లేదని తెలిపింది.

ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిగణించాలని కోరింది. ఇటీవల ఈడీ పిటిషన్లపై విచారణ జరిపింది తెలంగాణ హైకోర్టు. జగన్ కేసులు త్వరగా తేల్చాలని గతంలో పిటిషన్లు దాఖలైనట్టు గుర్తించింది హైకోర్టు. హరిరామజోగయ్య, మిగతా పిటిషన్లతో కలిపి జత చేయాలని ఈడీని  ఆదేశించింది. దీంతో అన్ని పిటిషన్లపై ఈనెల 13న అంటే మంగళవారం విచారణ చేపట్టనుంది హైకోర్టు.

పిటిషన్ విచారించిన తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఈడీ పిటిషన్ విషయం తెలియగానే వైసీపీలో గుబులు మొదలైంది. మరో ఏడాదిన్నరలో జగన్ పాదయాత్ర చేపట్టనున్న తరుణంలో ఇప్పుడు పాత కేసుల విచారణ ఇబ్బందిగా మారే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే పార్టీకి కష్టాలు తప్పవని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. మరి మంగళవారం హైకోర్టు తీర్పు చెబుతుందోనని అంటున్నారు.