రోజాకు టికెట్‌ లేనట్లేనా..?

నగరి నియోజకవర్గం వైసీపీలో రోజా వ్యతిరేక గ్రూపులు ఆమెకు టికెట్ దక్కకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి..ఆమెకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి పనిచేస్తామని అధిష్టానానికి చెప్తున్నాయి .. అయితే రోజా మాత్రం తనకు తప్ప మరెవరికి నగరి టికెట్ అవకాశం లేదంటూ రోజా తన అనుచరులతో చెప్తున్నారంట.. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా? .. టికెట్ రేసులో ఉన్న రోజా అసమ్మతి నాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.

 

చిత్తూరు జిల్లా నగరి నియోజవర్గం మరోసారి చర్చల్లో నలుగుతోంది.. మంత్రి రోజా ఈ నియోజక వర్గం నుంచి మూడోసారి బరిలో ఉంటారా?.. జగన్ ఆమెపై నమ్మకం ఉంచి టికెట్ ఇస్తారా? అన్నది సెగ్మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.. వైసీపీ గాలి బలంగా ఉన్న 2019 ఎన్నికల్లో రోజా బొటాబొటీ మెజార్టీతోనే విజయం సాధించారు. అదీ కాక రెండో సారి గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలోని పలువురు నేతలతో సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలోని అసమ్మతి వర్గం అంతా ఏకమై రోజాకు వ్యతిరేకంగా అమరావతిలో కూర్చొని పావులు కదుపుతున్నారట.

 

ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుచర వర్గంగా పేరున్న నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి , ఆమె భర్త ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కె.జె కుమార్లతోపాటు ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, పుత్తూరు కు చెందిన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అమ్ములు, వడమాల పేటకు చెందిన జడ్పిటిసి మురళి రెడ్డి, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు.. ఇలా రోజా వ్యతిరేకుల లిస్ట్ చాంతాడంత కనిపిస్తోంది. వీరంతా ప్రస్తుతం అమరావతిలో మకాం వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకు టికెట్ దక్కకుండా.. ముఖ్యనేతలపై ఒత్తిడి తెస్తున్నారంట.

 

రోజా వ్యవహార శైలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల పెత్తనంతో.. నగరిలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుందని .. అసమ్మతి నేతలు ఇఫ్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు .. ఇసుక ,గ్రావెల్ దందాలతో పాటు.. స్థానిక నాయకులకు విలువ ఇవ్వక పోవడం.. తమను రాజకీయంగా దెబ్బ తీయడానికి చేసిన ప్రయత్నాలను వివరించారంట.. ఇప్పటికే చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పలుమార్లు వారంతా సమావేశమై ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. దాని తర్వాత సజ్జల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. మరోవైపు పార్టీ సర్వేలలో కూడా ఆమె పరిస్థితి ఆశాజనకంగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను ఆమెకు అవకాశం ఇవ్వకూడదని అంటున్నారు .

 

తానే పార్టీ వాయిస్ అన్నట్లు ఆమె పరిధిని దాటి మాట్లాడి పలుసార్లు విమర్శలు విమర్శలు పాలైన ఉదంతాలున్నాయి. కొన్నిసార్లు ఆమె వ్యవహరించిన తీరు పార్టీని అప్రతిష్ట పాలు చేసిందని పార్టీ కేడరే అంటోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు అయినప్పుడు ఆమె టపాసులు కాల్చి డ్యాన్స్ చేయడం అనేది పెద్ద వివాదంగా మారింది. ఆ క్రమంలో చంద్రబాబు సొంత జిల్లాలో తటస్థంగా ఉన్న వర్గాలు కూడా ఆమె తీరుతో పార్టీకి వ్యతిరేకంగా మారారన్న వాదనను. రోజా వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారంట. దాంతో రోజా టికెట్ విషయం హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు.

 

అయితే ఆర్థిక వనరులతో పాటు, నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్న నాయకులు అసమ్మతి గ్రూపులో లేకపోవడం రోజాకు కలిసి వచ్చే అంశమని ఆమె వర్గం భావిస్తోంది. ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందని రోజా భావిస్తున్నారంట.. అదే టైంలో ఆర్థికంగా బలంగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు జగదీష్ తనకు అవకాశం ఇవ్వమంటూ వైసీపీ ముఖ్యలకు టచ్‌లో వెళ్లడం రోజా వర్గంలో గుబులు రేపుతోందంటున్నారు.. రోజా స్థానంలో జగదీష్‌ను ఓకే చేస్తే .. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి ఒక సీట్ ఇచ్చినట్లవుతుందని.. పార్టీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

 

మరి జగన్ థర్డ్ లిస్ట్‌లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో కాని .. రోజా సెల్ఫ్‌గోల్ చేసుకుంటూ వివాదాల్లో చిక్కుకుండటం ఆమెకు మైనస్ అయ్యే పరిస్థతి కనిపిస్తోందంటున్నారు. అందుకే మంత్రిగా ఉంటూ కూడా… ఆమె టికెట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.. వాస్తవానికి జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నాయకుల టికెట్ ఎక్కడా మార్చలేదు. కేవలం రోజారెడ్డి విషయంలోనే చర్చ నడుస్తుండటం

గమనార్హం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *