ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ.. 34% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షం హైకోర్టును ఆశ్రయించడంతో జీవో రద్దయిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేశాము న్యాయ నిపుణులతో చర్చలు జరిపామని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత బీసీలు దాదాపు 30 ఏళ్ల పాటు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోయారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలు, యువత, విద్యావంతులకు రాజకీయ అవకాశాలు కల్పించారని, స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు.
చంద్రబాబు బీసీ రిజర్వేషన్లను 34%కి పెంచారు. వైఎస్సార్, చంద్రబాబు సీఎంలుగా ఉన్న సమయంలో 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 24%కి ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలని అన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించకుండా బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. దీనివల్ల సుమారు 16 వేల మంది రాజకీయంగా నష్టపోయారు. బీసీలకు న్యాయం చేయాలనుకుంటే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రతిపక్ష వైసీపీని మంత్రి ప్రశ్నిస్తున్నానని అన్నారు.
1995 పంచాయతీరాజ్ చట్టంలో 34% రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందని, ఆ చట్టం ఇంకా రద్దు కాలేదని తెలిపారు. బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రతిపక్ష వైసీపీ ప్రయత్నిస్తుంది. దీంతో చివరి నిమిషం వరకు మేము న్యాయపోరాటం చేస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. సుప్రీంకోర్టులో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చించామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో 50%కు మించి రిజర్వేషన్లు కూడా ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. అవసరమైతే కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని అన్నారు.
16వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు పూర్తిగా ఇవ్వకుండా దారి మళ్లించారని ఆరోపించారు. సుమారు ₹7,000 కోట్ల నిధులు రాబట్టేందుకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జగన్కు బీసీలంటే వ్యతిరేకత ఉందని, టీడీపీ బలహీన వర్గాల పార్టీ అని, గెలిచినా ఓడినా బీసీలు తమ వెంట ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ బీసీలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఆస్తులు లాక్కోవడం జరిగిందని ఆరోపించారు. న్యాయస్థానంలో ఇబ్బందులు ఎదురైనా పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.