ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ విధానంలో ఒక చిన్న మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికే వచ్చి పూర్తి పింఛన్ డబ్బులను చేతికి ఇచ్చేవారు. కానీ ఇకపై అలా కాకుండా, పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త నిర్ణయంపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్చ్ సీఈవో వాకాటి కరుణ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
ఇకపై పింఛన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా అని వేర్వేరుగా ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వచ్చే వాటాను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రం ఎప్పటిలాగే సచివాలయ సిబ్బంది ఒకటో తేదీన మీ ఇంటికే వచ్చి చేతికి అందిస్తారు.
వృద్ధులకు వచ్చే రూ.4,000 పింఛనులో రాష్ట్ర వాటా రూ.3,800 చేతికి లభిస్తుంది. మిగిలిన రూ.200 కేంద్ర వాటాగా నేరుగా ఖాతాలో పడుతుంది. అలాగే దివ్యాంగులకు వచ్చే రూ.6,000 లో రాష్ట్ర వాటా రూ.5,700 చేతికి ఇస్తే, కేంద్రం ఇచ్చే రూ.300 బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది.
కేంద్రం అందించే ఈ వాటా నిధులు మీ అకౌంట్లో పడాలంటే ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు కచ్చితంగా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఈ అనుసంధానం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు జమ కావు. కాబట్టి పింఛన్‌దారులు వెంటనే తమ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఆధార్ సీడింగ్ పూర్తయిందో లేదో సరిచూసుకోవాలి. లింక్ కాకపోతే వెంటనే పూర్తి చేయడం మంచిది.
పింఛన్ల పంపిణీ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. కేంద్ర నిధుల బదిలీలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేదా మధ్యవర్తులు లేకుండా చూసేందుకు ఈ రూల్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పింఛన్ల నిధుల్లో కేంద్రం ఎంత ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తోందనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా.. లబ్ధిదారులు ఈ మార్పు పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ప్రతి నెలా 1వ తేదీనే మీ ఇంటి వద్దకే పింఛన్ అందుతుంది.