.హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఆయన అభిమానులు భావిస్తే, అందుకు భిన్నంగా ఆయన మెగాఫోన్ పట్టుకున్నాడు. సందీప్ కిషన్ హీరోగా ఒక సినిమాను రూపొందించాడు .. ఆ సినిమా పేరే ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.
గురు (సందీప్ కిషన్) తల్లిదండ్రులను కోల్పోయిన ఓ అనాథ. తనని చేరదీసిన డాక్టర్ ‘నీల్’ (రాజు సుందరం)తో అతను ఎంతో సన్నిహితంగా ఉంటాడు. తండ్రి చేసిన అప్పులు అతనిని సతమతం చేస్తుంటాయి. అందుకు అవసరమైన డబ్బులను ఎలా సర్దుబాటు చేయాలో తెలియక తికమక పడుతుంటాడు. ఆ ఇంట్లో తల్లికి సంబంధించిన ఒక పాత లైబ్రరీ ఉంటుంది. ఆమెకి గుర్తుగా అతను ఆ లైబ్రరీని కాపాడుకుంటూ వస్తుంటాడు. ఆ లైబ్రరీని ఉపయోగించుకుని ‘ఆడియో బుక్ ఛానల్’ ను ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన చేస్తాడు.
ఆడియో బుక్ ఛానల్ కి లేడీ వాయిస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆర్జేగా పనిచేస్తున్న ‘సామ్’ (ఫరియా అబ్దుల్లా)ను ‘గురు’ సంప్రదిస్తాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం మొదలవుతుంది. అప్పు తీర్చకపోతే ఆ ఇంటిని సొంతం చేసుకుంటామని అప్పులవాళ్లు ‘గురు’ను హెచ్చరిస్తారు. దాంతో ఎలాగైనా సాధ్యమైనంత త్వరగా పెద్ద మొత్తంలో సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. క్లబ్ లో జూదమాడి ‘విన్సెంట్’తో గెంటివేయబడతాడు.
వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్) ఏనుగు దంతాలు .. పులిచర్మాలు అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. వెయ్యికోట్ల రూపాయలను అతను ఒక ఒక ఐరన్ బాక్స్ లో పెట్టేసి .. ఆ బాక్స్ కి సంబంధించిన ‘కీ’ ప్లస్ ‘పెన్ డ్రైవ్’ ని తన దగ్గర పెట్టుకుంటాడు. అనుకోకుండా ఆ ‘కీ’ ‘గురు’ ఇంటికి చేరుతుంది. ఆ ‘కీ’ కోసం ఒక వైపున వీరయ్యరెడ్డి .. మరో వైపున విన్సెంట్ మనుషులు వెతకడం మొదలు పెడతారు. చివరికి అది ఎవరికి చిక్కుతుంది? ఆ వెయ్యికోట్ల సంపద ఎవరికి దక్కుతుంది? అనేదే కథ.
‘గురు’ తన తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసం, తల్లికి ఇష్టమైన ఇంటిని వదులుకోవలసి వస్తుంది. అది ఎంతమాత్రం ఇష్టం లేని గురు, ఆ మొత్తాన్ని సాధించి తీరాలనే పట్టుదల కలుగుతుంది. అప్పుడే అతనికి వెయ్యి కోట్లకు సంబంధించిన ఒక టాస్క్ ఎదురవుతుంది. ఆ డబ్బును దక్కించుకోవడం కోసం అతను ఏం చేస్తాడు? ఎలాంటి సవాళ్లను దాటుకుంటూ వెళతాడు? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.
గురు అతని స్నేహితుడు .. లవర్ కలిసి ఒక గ్యాంగ్ గా .. వీరయ్య రెడ్డి గ్యాంగ్ .. విన్సెంట్ గ్యాంగ్ .. తెరపై కనిపిస్తాయి. కథ మొత్తం ఈ మూడు గ్యాంగుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మూడు గ్యాంగులు వెతుకులాడే ఒక ‘కీ’ చుట్టూ పరిగెడుతూ ఉంటుంది.
దర్శకుడు తాయారు చేసుకున్న కథ ప్రకారం ఈ కథలో మదర్ సెంటిమెంట్ ను అనుకున్నాడు. అలాగే హీరో పాత్ర చుట్టూ ఆర్ధిక ఇబ్బందులను క్రియేట్ చేసి ఆడియన్స్ కి ఒక పెయిన్ ఉండేలా చూసుకున్నాడు. తనకి ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అనే ఒక పరిస్థితిని సృష్టించాడు. అందుకోసం హీరో రంగంలోకి దిగేలా చేశాడు. అయితే కథలోని అంశాలను ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోయాడు. ప్రతి అంశంలోను గాఢతను ఆవిష్కరించలేకపోయాడు.
వేయ్యి కోట్ల రూపాయలకు సంబంధించిన ‘కీ’ చేతులు మారుతూ వెళ్లడం .. దాని కోసం పెట్టే పరుగులు .. ఒకరిపై ఒకరు చేసుకునే దాడులు మామూలే. ఈ నేపథ్యంలోనే కామెడీని కూడా వర్కౌట్ చేయాలని దర్శకుడు అనుకున్నాడు. కానీ ఇక్కడ కూడా మిగతా విషయాలలో జరిగిన పొరపాటే జరిగింది. ఇక పాత సినిమాల మాదిరిగా పాత ఫ్యాక్టరీకి క్లైమాక్స్ ను తరలించారు. ఇక్కడైనా కొత్తగా ఏమైనా చూపిస్తారేమోనని అనుకున్న ఆడియన్స్ కి నిరాశనే ఎదురవుతుంది.
సందీప్ కిషన్ చాలా ఈజ్ తో చేశాడు. ఫరియా అబ్దుల్లా చాలా గ్లామరస్ గా మెరిసింది. ఇక సంపత్ రాజ్ విలనిజం ఆడియన్స్ కి సుపరిచితమే. అయితే ఆయన పాత్రలో పవర్ లోపించడం కనిపిస్తుంది. శివ్ పండిట్ విలనిజాన్ని కూడా తేల్చిపారేశారు. కేథరిన్ ఐటమ్ సాంగ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కృష్ణన్ వసంత్ ఫొటోగ్రఫీ .. తమన్ నేపథ్య సంగీతం ఈ కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి తమవంతు ప్రయత్నం చేశాయి. ప్రవీణ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది.
సందీప్ కిషన్ – ఫరియా అబ్దుల్లా అనగానే, హైట్ పరంగా మంచి జోడీ అనిపిస్తుంది. కానీ తెరపై ఇద్దరి మధ్య లవ్ .. రొమాన్స్ గట్రా ఏమీ ఉండవు. తాము లవర్స్ అనే ఆలోచన వాళ్లకి లేదు .. ఆడియన్స్ కి అలాంటి అభిప్రాయం కలగనీయలేదు. లైకా ప్రొడక్షన్స్ అనగానే మనకి అర్థమైపోతుంది .. నిర్మాణ పరమైన విలువల విషయంలో రాజీ ఉండదని. అదే విషయాన్ని ఈ సినిమా మరోమారు నిరూపిస్తుంది. జేసన్ సంజయ్ ను నమ్మి గట్టిగానే ఖర్చు పెట్టారు.
కోట్ల రూపాయల డబ్బు .. ఆ డబ్బును దక్కించుకోవడం కోసం చేసే ముఠాలు ప్రయత్నాలు .. హీరో వైపు నుంచి కూడా సాగే పోరాటం నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఎమోషన్స్ తో ముడిపెడుతూ భారీ యాక్షన్ దృశ్యాలతో ఆశ్చర్యపరిచిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలకి ఏ మాత్రం భిన్నంగా లేకుండా రొటీన్ గా తీసిన సినిమా ఇది. జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమా అనే ప్రత్యేకత తప్ప, మరే విధంగాను ప్రభావితం చేయలేకపోయిన సినిమా ఇది