తెలుగులోకి ‘హనుమాన్ అంశ్‌’..! రిలీజ్ ఎప్పుడంటే..?

ఆధ్యాత్మిక కథాంశంతో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్‌’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్ల మార్క్‌ను దాటిన ఈ సినిమా.. ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది.

నిజానికి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ తెలుగు వెర్షన్‌ను సమర్పించనున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే డీల్‌ కుదరకపోవడంతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో తెలుగు టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయింది. ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్‌ స్వయంగా తెలుగు విడుదల బాధ్యతలను తీసుకుంది.

కేవలం రూ.1.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు చెబుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28 నాటికి భారత్‌లో రూ.300 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లు సాధించింది. 52వ రోజుకు ఈ మార్క్‌ను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నీమ్ కరోలి బాబా జీవిత ప్రేరణతో తెరకెక్కిన ఆధ్యాత్మిక కథ. లక్ష్మీ నారాయణ్‌ అనే వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లి ప్రముఖ సాధువుగా ఎలా మారాడన్నదే కథ. నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్యా నటించారు. విహాన్ షెదెగే, పూర్ణిమ తివారీతో పాటు పలువురు కీలక పాత్రల్లో కనిపించారు.