కొడంగల్‌లో సభతో రేవంత్ రెడ్డికి చెమటలు పట్టిస్తాం: తలసాని..

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే భారీ బహిరంగ సభ నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతామని బీఆర్ఎస్ ప్రకటించింది.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కొడంగల్‌లో మేము పెట్టబోయే సభతో ముఖ్యమంత్రికి చెమటలు పట్టిస్తాం” అని ఆయన హెచ్చరించారు. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభ ముగిసిన తర్వాత కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ ఉంటుందని తలసాని స్పష్టం చేశారు. 

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో సభ నిర్వహించడాన్ని ఆయన ప్రస్తావించారు. సిరిసిల్ల ఏమైనా పక్క రాష్ట్రంలో ఉందా? అని ప్రశ్నిస్తూ… సిరిసిల్లలో బలప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆ సభ వల్ల సీఎంకు రాజకీయంగా నష్టమే జరిగిందని అన్నారు.

ఇదే సందర్భంగా, ఖైరతాబాద్ ఉపఎన్నికపై తలసాని పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికలో బీఆర్ఎస్ వందకు వంద శాతం గెలుస్తుందని జోస్యం చెప్పారు. పార్టీ మారిన దానం నాగేందర్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని అన్నారు. డబ్బులు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయరని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని కూడా తలసాని తప్పుబట్టారు. సభలో తాము చేయని దానికి, బయట జరిగిన వివాదానికి స్పీకర్‌కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.