ఎమ్మెల్సీ పోరులో కేటీఆర్ సంచలన వ్యూహం..?

పదేళ్లపాటు తిరుగులేని అధికారంలో ఉన్న BRS పార్టీకి 2023 అసెంబ్లీ ఓటమి తర్వాత ఏ ఒక్క ఎన్నికలోనూ సానుకూల ఫలితం దక్కలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోగా, కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ పరాభావం ఎదురైంది. గత మూడు ఎమ్మెల్సీ పోటీల నుంచి BRS తప్పుకోవడంతో బీజేపీ, ఇండిపెండెంట్లు విజయం సాధించారు. దీంతో మార్చి 2027లో ఖాళీ కానున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలపై BRS గట్టిగా దృష్టి పెట్టింది.

ఈ రెండు స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్గొండ నేతలతో సమావేశమైన ఆయన, తాజాగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. సామాజిక సమీకరణాలు, ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించడంతో పాటు ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా గెలుపు గుర్రాలను బరిలోకి దించుతుండటంతో ఈ ఎన్నికలు త్రిముఖ పోరుగా మారనున్నాయి.

అధికార కాంగ్రెస్ బలం, బీజేపీ జోరును తట్టుకుని పట్టభద్రుల స్థానాల్లో BRS జెండా ఎగురవేయడం అంత సులువు కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇలాంటి టైంలో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ పూర్వవైభవం తెచ్చుకుని పరువు కాపాడుకునేందుకు కేటీఆర్ చేస్తున్న ఈ క్షేత్రస్థాయి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.