టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఉన్నట్టుండి ఐటీ సోదాలు కలకలం రేపాయి. గతంలో సడన్గా ఐటి అధికారులు దాడులు నిర్వహించి,అందరినీ ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు అనుకోని హడావిడి సోదాలు మరోసారి సెలబ్రిటీలను వార్తల్లో నిలిచేలా చేశాయి. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)తో పాటు బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీ (Vasu bhagnani) వీరితో ముడిపడి ఉన్న మొత్తం 12 ప్రాంతాలలో ముంబై ఐటి విభాగానికి చెందిన వేర్వేరు బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించడం గమనార్హం
అసలు విషయంలోకి వెళ్తే.. సినిమాల నిర్మాణాల పేరుతో అక్రమంగా నిధులను విదేశాలకు తరలిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు, పన్ను ఎగవేతల అనుమానాలతోనే ముంబై ఇన్కమ్ టాక్స్ అధికారులు ఒకేసారి పలువురు ప్రముఖులు, నిర్మాణ సంస్థల ఇళ్లపై, ఆఫీసులపై దాడులు చేపట్టారు. ఈ దాడుల జాబితాలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ వాసు భగ్నానీతో పాటు జాకీ భగ్నానీ, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పానోరమా స్టూడియోస్’ ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉండడం విశేషం. వీరితో ముడిపడి ఉన్న సుమారుగా 12 ప్రాంతాలలో ముంబై ఐటి విభాగానికి చెందిన వేర్వేరు బృందాలు ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నాయి. సినిమా షూటింగ్ లు , ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ వ్యయాల సాకుతో భారీగా నిధులను విదేశాలకు తరలిస్తున్నట్లు ఐటీ శాఖకు కొద్ది రోజులుగా పక్కా సమాచారం అందుతోందట. అందులో భాగంగానే పెద్ద ఎత్తున పన్నుల అవకతవకలు, ఆర్థిక అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు బలంగా అనుమానిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్, పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలను తీసిన ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ (రకుల్ ప్రీత్ సింగ్ మామ), దృశ్యం ఫ్రాంచైజీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన పానోరమా స్టూడియోస్ ఇందులో ప్రథమంగా నిలిచాయి. ఐటి అధికారులు రంగంలోకి దిగడంతో సినీ పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆర్థిక మోసానికి సంబంధించి కీలకమైన విషయాలను ఐటి శాఖ వెల్లడించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు ఐటీ సోదాల దాడుల కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తుండడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చివరిగా దేదే ప్యార్ దే 2, పతి పత్ని ఔర్ దో వంటి చిత్రాలలో నటించిన ఈమె తాజాగా రామాయణ చిత్రంలో శూర్పణఖ పాత్ర పోషిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ మండోదరి పాత్ర పోషిస్తుంది. భారీ అంచనాల మధ్య రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా.. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 6వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. రెండవ భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.