కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను అక్టోబర్ 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన సాంకేతిక అనుమతులు లభించిన వెంటనే పనులు మొదలుపెడతామని స్పష్టం చేశారు. 2027 వర్షాకాలం నాటికి ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
బ్యారేజీల భద్రత, నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సహా నిపుణుల కమిటీలు లేవనెత్తిన అభ్యంతరాలను, సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని, జాతీయ స్థాయి సాంకేతిక సంస్థల సిఫార్సుల మేరకే పనులు చేపడతామని వెల్లడించారు. ఈ మూడు బ్యారేజీల భద్రతను పటిష్ఠం చేసి, వాటి పూర్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన ఈ సమావేశంలో నొక్కిచెప్పారు.