విజయవాడలో ‘పేదలకు పట్టాభిషేకం’.. ఈ నెల 30న చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు..

పేదలకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించే బృహత్తర కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా నగరవాసులను వేధిస్తున్న ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమ స్ఫూర్తితో, ఇప్పుడు విజయవాడలో భారీ ఎత్తున ఇళ్ల క్రమబద్దీకరణ పట్టాల పంపిణీకి సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 24,057 కుటుంబాలకు సంపూర్ణ హక్కులతో కూడిన పట్టాలను అందించనున్నారు.

విజయవాడలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన అజెండాగా మారుతున్న ఇళ్ల పట్టాల సమస్యకు కూటమి సర్కార్ చరమగీతం పాడుతోంది. దశాబ్దాల క్రితం అందించిన ఎన్టీఆర్ పట్టాలకు చట్టబద్ధత కల్పిస్తూ, వాటిపై లబ్దిదారులకు పూర్తి యాజమాన్య హక్కులను కట్టబెడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ. 9,800 కోట్ల విలువైన 617 ఎకరాల భూమిపై పేద, మధ్య తరగతి కుటుంబాలకు అధికారం లభించనుంది. దీనివల్ల ఒక్కో కుటుంబానికి సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు లబ్ది చేకూరనుంది. 

ముఖ్యంగా, విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో కొండలపై ఇళ్లు నిర్మించుకున్న వారి చిరకాల స్వప్నం ఈ కార్యక్రమంతో నెరవేరబోతోంది. తమ ఇళ్లకు శాశ్వత భద్రత, భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కొండ ప్రాంత నివాసితులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలోనూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వేగంగా స్పందించి, ఇప్పుడు 29.86 లక్షల చదరపు గజాల స్థలంపై లబ్దిదారులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తోంది. క్రమబద్దీకరణ చేస్తున్న భూముల మార్కెట్ విలువ దాదాపు రూ. 24,297 కోట్లుగా ఉంటుందని అంచనా.

ఈ పట్టాల పంపిణీ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం సహా మొత్తం 8 నియోజకవర్గాల్లోని 15 మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీలు 12,093, ఓసీలు 6,130, ఎస్సీలు 4,546, ముస్లిం బీసీలు 955, ఎస్టీలు 333 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నాయి.