ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రానున్న నెలల్లో ఎల్‌నినో మరింత తీవ్రతరమై ‘సూపర్ ఎల్‌నినో’గా మారే ప్రమాదం ఉందని, దాని ఫలితంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.51 లక్షల మంది మరణించవచ్చని అమెరికాకు చెందిన ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్’ అనే సంస్థ తన నివేదికలో హెచ్చరించింది.
ఈ నివేదిక ప్రకారం, ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా దక్షిణార్థగోళంలోని దేశాలపై ఉండనుంది. నైజీరియా, సూడాన్ వంటి ఆఫ్రికా దేశాల్లో 66,800 మంది, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాల్లో 19,400 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. భారత్‌లో కూడా దాదాపు 15,800 మంది, బ్రెజిల్లో 13,300 మంది మరణించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఆగస్టు నెల చరిత్రలోనే అత్యంత ఉక్కపోత నమోదైన నెలగా రికార్డుల్లోకి ఎక్కడం, తీవ్రతరమవుతున్న ఎల్‌నినోకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మరణాలను నివారించడానికి ప్రభుత్వాలు ఉష్ణోగ్రత హెచ్చరికలు జారీ చేయడం, కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
వ్యవసాయ రంగంపైనా తీవ్ర ప్రభావం
ఎల్‌నినో ప్రభావం దేశ వ్యవసాయ రంగంపైనా తీవ్రంగా పడనుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. వర్షపాతం లోటు పెరగడంతో ఖరీఫ్ పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల 21 నాటికి దేశంలో సగటు వర్షపాతం 15 శాతం తక్కువగా నమోదైందని, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ లోటు 27 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా దక్షిణాదిలో కేవలం 52 శాతానికి పడిపోయాయని పేర్కొంది. బలపడుతున్న ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని హెచ్చరించింది.