నది లేని ఎడారి దేశం.. సౌదీ అరేబియా 1000 కోట్ల మొక్కలతో కొత్త చరిత్రకు సిద్ధం

ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, జలవనరులు, నదులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే సహజ నదులు లేకపోయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగిన దేశం సౌదీ అరేబియా. అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన సౌదీ.. విస్తారమైన చమురు నిల్వలతో ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పర్యావరణ పరంగా మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది.

95 శాతానికి పైగా భూభాగం ఎడారి ప్రాంతాలతో ఉన్న సౌదీ అరేబియాను పచ్చదనంతో నింపేందుకు భారీ ప్రణాళికను చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఏకంగా 1000 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎడారి ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడంతో పాటు పర్యావరణాన్ని మెరుగుపరచడం, భూసారాన్ని కాపాడటం ఈ ప్రణాళికలో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

చమురు సంపదతో ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సౌదీ.. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణపైనా దృష్టి సారిస్తోంది. విస్తారమైన ఎడారి భూభాగాన్ని క్రమంగా పచ్చని ప్రాంతాలుగా మార్చే ఈ భారీ ప్రణాళిక పూర్తయితే దేశ వాతావరణం, పర్యావరణ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. సౌదీ చేపట్టిన ఈ భారీ గ్రీన్‌ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.