అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆగస్టు 28న రైవాడ గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరైన సందర్భంగా మాజీ సర్పంచ్ చల్లా తాతయ్య వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది.
ఈ వ్యవహారంపై టీడీపీకి చెందిన చల్లా తాతయ్యతో పాటు ఆయన తమ్ముడు, వైసీపీకి చెందిన చల్లా నాయుడు వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. నాలుగు రోజులుగా సమస్య కొనసాగుతుండటంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో భాగంగా పోలీసులు ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు.
ఏఎస్ఐ ప్రసాద్ ఇరువర్గాలతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా ప్రయత్నించారు. అనంతరం వారిని స్టేషన్ నుంచి పంపించారు. అయితే తాజాగా మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.