గాయం నుంచి పూర్తిగా కోలుకుని టీమిండియాలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. హార్దిక్ మళ్లీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. తాజా లెగ్ సమస్య కారణంగా సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉందని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. దీంతో హార్దిక్ పునరాగమనంపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హార్దిక్ గత కొంతకాలంగా ఫిట్‌నెస్, బౌలింగ్‌పై ప్రత్యేకంగా సాధన చేస్తున్నాడు. పూర్తి తీవ్రతతో బౌలింగ్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పురోగతి సాధిస్తున్న సమయంలోనే కాలిలో అసౌకర్యం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం బౌలింగ్‌కు దూరంగా ఉండాలని బీసీసీఐ వైద్య బృందం సూచించినట్లు సమాచారం. హార్దిక్ పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కోసం ఈ వారం బీసీసీఐ సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. బెంగళూరు సీఓఈలో చికిత్స, రిహాబిలిటేషన్ పొందుతున్న ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా సెలెక్టర్లు తాజా నివేదికలు తీసుకోనున్నారు. హార్దిక్ ఫిట్‌నెస్‌పై వచ్చే నివేదిక ఆధారంగానే అతడి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో టీమిండియాలోకి హార్దిక్ పునరాగమనం మరింత ఆలస్యం అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.