ఇల్లు కట్టేందుకు ఎంత ఖర్చవుతుంది? 5 నిమిషాల్లో రఫ్ బడ్జెట్ ఇలా లెక్కించండి!

సొంత ఇల్లు నిర్మించుకోవడం చాలామంది కల. అయితే ప్లాట్ చేతికి వచ్చిన తర్వాత ముందుగా వచ్చే ప్రశ్న.. ఇల్లు పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుంది? అనేదే. నిర్మాణం ప్రారంభించిన తర్వాత బడ్జెట్ అదుపు తప్పకుండా ఉండాలంటే ముందుగానే ఓ రఫ్ అంచనా వేసుకోవడం ఎంతో ఉపయోగకరం. ఇందుకోసం పెద్దగా లెక్కలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి బిల్ట్‌-అప్ ఏరియా, మీ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న చదరపు అడుగు నిర్మాణ వ్యయం తెలిస్తే ప్రాథమిక బడ్జెట్‌ను సులభంగా అంచనా వేసుకోవచ్చు.

అయితే ముందుగా బిల్ట్‌-అప్ ఏరియా అంటే ఏమిటో తెలుసుకోవాలి. కేవలం ప్లాట్ విస్తీర్ణాన్ని లెక్కలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదు. మీరు నిర్మించబోయే అన్ని అంతస్తుల విస్తీర్ణాన్ని కలిపితే వచ్చే మొత్తమే బిల్ట్‌-అప్ ఏరియా. ఉదాహరణకు 600 చదరపు అడుగుల ప్లాట్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్ 600, మొదటి అంతస్తు 600 చదరపు అడుగుల చొప్పున నిర్మిస్తే.. మొత్తం బిల్ట్‌-అప్ ఏరియా 1,200 చదరపు అడుగులు అవుతుంది.

ఇక నిర్మాణ బడ్జెట్‌ను ప్రభావితం చేసే మరో కీలక అంశం చదరపు అడుగు నిర్మాణ ధర. ఇది ప్రాంతాన్ని బట్టి గణనీయంగా మారుతుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో కూలీల ఖర్చు, సిమెంట్, స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు, రవాణా, ఇంటీరియర్ ఫినిషింగ్‌ వంటి అంశాల కారణంగా రేట్లు ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఒక ప్రాంతంలో ఉన్న నిర్మాణ రేటును మరో ప్రాంతానికి నేరుగా వర్తింపజేయలేం. సాధారణంగా బిల్ట్‌-అప్ ఏరియా × చదరపు అడుగు నిర్మాణ రేటు = ప్రాథమిక నిర్మాణ బడ్జెట్గా అంచనా వేసుకోవచ్చు.