ఇంట్లో సువాసన కోసం వాడుతున్నారా..? ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చట!

ఇంట్లో మంచి వాసన కోసం స్ప్రేలు, ప్లగ్‌-ఇన్ ఫ్రెషనర్లు, ఆటోమేటిక్ స్ప్రేలు, రీడ్ డిఫ్యూజర్లు, జెల్స్, ఫ్రాగ్రెన్స్ బీడ్స్ వంటి వాటిని చాలామంది ఉపయోగిస్తుంటారు. దుర్వాసనను తగ్గించి గదులను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. అయితే వీటి వినియోగంతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఉత్పత్తుల్లో ఉండే కొన్ని సువాసన రసాయనాలు, వాయువులు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువసేపు మూసి ఉన్న గదుల్లో వీటిని అధికంగా ఉపయోగించడం వల్ల కళ్లలో మంట, ముక్కు, గొంతు ఇబ్బంది, తలనొప్పి వంటి సమస్యలు కొందరిలో కనిపించవచ్చని చెబుతున్నారు. సువాసనలకు సున్నితంగా స్పందించే వ్యక్తుల్లో అసౌకర్యం మరింత ఎక్కువగా ఉండొచ్చు.

అందుకే ఇంట్లో సువాసన కోసం ఫ్రెషనర్లను అవసరానికి మించి ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గదుల్లో గాలి ప్రసరణ ఉండేలా కిటికీలు తెరవడం, దుర్వాసనకు అసలు కారణాన్ని గుర్తించి తొలగించడం వంటి సహజమైన మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రెషనర్లు ఉపయోగించాల్సి వస్తే లేబుల్‌పై సూచించిన విధంగా, పరిమితంగా ఉపయోగించడం మంచిది.