గురుకుల విద్యార్థుల తరలింపును అడ్డుకున్న గిరిజన సంఘాల నాయకులు

విశాఖపట్నం మధురవాడ మారికవలసలోని APTWR పాఠశాల నుంచి ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు కోసం విద్యార్థులను మారికవలస గురుకులం నుంచి తరలించే ప్రక్రియను గిరిజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను బలవంతంగా మన్యం స్కూల్‌కు తరలించేందుకు అధికారులు ప్రయత్నించారని వారు ఆరోపించారు.

విద్యార్థులను తరలిస్తున్న అధికారులను గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థుల విద్యాభవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మారికవలసలోనే పాఠశాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

ఇప్పటికే అనేక సమావేశాల్లో ఆదివాసీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ పాఠశాలను కొనసాగించాలని అధికారులను కోరినట్లు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. విద్యార్థులను తరలించే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.