దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఇండిగో డిజిటల్ సేవల్లో మరోసారి సాంకేతిక అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఇండిగో అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్‌లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాంకేతిక లోపం కారణంగా టికెట్ బుకింగ్స్, వెబ్ చెక్-ఇన్, పేమెంట్ కన్ఫర్మేషన్లు వంటి ఆన్లైన్ సేవలు సరిగా పనిచేయలేదని ప్రయాణికులు తెలిపారు. దీంతో విమాన ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేసుకునేందుకు వారు ఇబ్బందులు పడ్డారు.
ఆన్లైన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు ఇండిగో సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. డిజిటల్ సేవలు ఎప్పుడు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తారనే దానిపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.