UK Heatwave: బ్రిటన్‌ను వణికిస్తున్న వేడి.. 38.1 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

బ్రిటన్‌లో వేసవి తాపం తీవ్ర రూపం దాల్చింది. జాతీయ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం దేశంలో ఉష్ణోగ్రత 38.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. దీంతో ఈ ఏడాది జూన్ 28న నమోదైన 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు బద్దలైంది. అయితే 2003 ఆగస్టులో నమోదైన 38.5 డిగ్రీల సెల్సియస్ ఆల్‌టైమ్ రికార్డుకు మాత్రం ఇది కాస్త దూరంలో నిలిచింది.

ఫ్రాన్స్‌ సహా యూరప్‌లోని పలు దేశాలను తీవ్ర వేడిగాలులు ఇబ్బంది పెడుతున్న సమయంలో బ్రిటన్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ వేసవిలో ఇప్పటికే ఐదోసారి తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తీవ్రమైన వేడి కారణంగా ప్రజలు పగటిపూట బయటకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించేందుకు వీలైనంత వరకు చల్లటి ప్రదేశాల్లో ఉండటం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.