విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు, షూస్ పంపిణీ

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలోని మేడిగడ్డ తండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన ఏకరూప దుస్తులు, షూస్‌ను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజేశ్వరి మల్లేష్, ఉప సర్పంచ్ విజయ్ రాథోడ్ విద్యార్థులకు దుస్తులు, షూస్ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచితంగా అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు.

విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని, తద్వారా కన్న తల్లిదండ్రులతో పాటు గ్రామానికి కూడా పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని వారు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.