Kumuram Bheem: కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో ఒప్పంద కార్మికుల విధుల బహిష్కరణ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 మంది ఒప్పంద కార్మికులు విధులను బహిష్కరించారు. భీం సొసైటీ ఏజెన్సీ ద్వారా ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమకు వేతనాలు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. ఒప్పంద సమయంలో నెలకు రూ.15,000 జీతం ఇస్తామని చెప్పి.. ప్రస్తుతం చేతికి కేవలం రూ.10,000 మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఉద్యోగం ఇప్పిస్తామని, “లైఫ్ టైమ్ వర్క్” ఉంటుందని చెప్పి తమ నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని కార్మికులు ఆరోపించారు.

తమలో 10 మంది కార్మికులను విధులకు రావద్దని కాంట్రాక్టర్ బెదిరిస్తున్నారని వారు తెలిపారు. సెలవులు తీసుకుంటే ఇంటికి పిలిపించి బాండ్ పేపర్లపై సంతకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రిలో శుభ్రతతో పాటు వివిధ విభాగాల్లో అన్ని రకాల పనులు చేయిస్తున్నప్పటికీ.. వేతనాల్లో మాత్రం కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా తమకు ESI, PF వంటి కనీస చట్టబద్ధ సదుపాయాలు కల్పిస్తున్నారో లేదో కూడా స్పష్టత లేదని కార్మికులు పేర్కొన్నారు. తమ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి, ఒప్పందంలో పేర్కొన్న విధంగా పూర్తి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.