నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకల నిర్వహణపై అవగాహన సమావేశం నిర్వహించారు. యువకులు, గణపతి మండపాల నిర్వాహకులు, గ్రామ ప్రజలు, వీడీసీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా నందిపేట ఎస్సై వినయ్ మాట్లాడుతూ.. వినాయక చవితిని ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజేలు ఏర్పాటు చేయరాదని, మద్యం సేవించి వేడుకల్లో పాల్గొనకూడదని ఎస్సై స్పష్టం చేశారు. వినాయక చవితికి ఎంతో గొప్ప చరిత్ర, పవిత్రత ఉందని.. డీజేలు, మద్యం వంటి వాటి వల్ల పండుగ పవిత్రతకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేసినా, మద్యం సేవించి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వినయ్ హెచ్చరించారు. గ్రామ ప్రజలు, గణపతి మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.