భారత దేశవాళీ క్రికెట్లో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు అద్భుతమైన రికార్డులు సాధించినప్పటికీ టీమిండియా తరఫున ఆడే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి ఆటగాళ్లలో సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా ఒకరు. 36 ఏళ్ల ఈ బౌలర్ దేశవాళీ క్రికెట్లో ఏకంగా 600కు పైగా వికెట్లు తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు భారత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టలేకపోయాడు.
609 వికెట్లు.. అయినా జాతీయ జట్టుకు దూరం
ధర్మేంద్రసింగ్ జడేజా ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ, టీ20 క్రికెట్లో కలిపి ఇప్పటివరకు 609 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో అతని ప్రదర్శన సంవత్సరాలుగా నిలకడగా కొనసాగుతోంది. 2017-18 సీజన్ నుంచి ఇప్పటివరకు రంజీ ట్రోఫీలో ఏకంగా 293 వికెట్లు తీసుకున్నాడు. ఈ కాలంలో అతని కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ మరొకరు లేకపోవడం దేశవాళీ క్రికెట్లో అతని ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అయితే జాతీయ జట్టులోకి రావడానికి అతనికి గట్టి పోటీ ఎదురైంది. భారత స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ బౌలర్లు ఉండటంతో అవకాశాలు పరిమితమయ్యాయి. ఫలితంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ ధర్మేంద్రసింగ్ జడేజాకు టీమిండియా తరఫున ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. తాజాగా అతని 609 వికెట్ల రికార్డు మరోసారి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.